Home  »  Bollywood News  »  33 ఏళ్ల వయసులో 14 ఏళ్ల బాలుడిగా జీవించేసాడు.. షారుఖ్ ఖాన్‌నే వెనక్కి నెట్టిన నటుడు!

Updated : Jun 3, 2026

కలలతో మొదలైన ఒక సాధారణ యువకుడి ప్రయాణం, ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సరికొత్త సంచలనానికి వేదికగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు యావత్ సినీ వర్గాలలో ఒకే ఒక్క నటుడి పేరు విపరీతంగా మార్మోగిపోతోంది, ఆయనే యుధ్వీర్ అహ్లావత్ (Yudhvir Ahlawat). నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటిటి వేదికగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మూవీ “కర్తవ్య” (Kartavya) ప్రస్తుతం భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క సినీ ప్రియుడికి అందులో నటించిన ఒకానొక పాత్ర ఖచ్చితంగా గుండెల్లో నిలిచిపోతుంది. ఆ అద్భుతమైన కథకు అసలైన మూలం, ప్రాణం ‘హర్పాల్’ అనే ఒక మైనర్ పాత్ర. సినిమా కథ మొత్తం ఈ హర్పాల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ, ఈ పాత్ర వలనే ఊహించని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో హర్పాల్ పాత్ర ప్రేక్షకులను కన్నీరు పెట్టించక మానదు. ఈ పాత్రలో అసాధారణ నటనను కనబరిచిన యుధ్వీర్ ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రముఖ నటుల జాబితాలో చేరిపోయాడు.

ఈ పాత్రలో ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం 33 ఏళ్ల వయసున్న యుధ్వీర్ అహ్లావత్, ఈ సినిమాలో కేవలం 14 ఏళ్ల మైనర్ బాలుడిలాగా స్క్రీన్ పై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వయసుకు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోవడమే కాకుండా, చాలా అద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే ఆయన ఆ పాత్రలో నటించలేదు, జస్ట్ జీవించారు అని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. 

ప్రతిభావంతుడైన దర్శకుడు పుల్కిత్ ఎంతో ఇంటెన్స్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హర్పాల్ పాత్రతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యుధ్వీర్ అహ్లావత్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. హర్యానాకు చెందిన ఈ 33 ఏళ్ల నటుడు 2019వ సంవత్సరంలో వచ్చిన ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత 2022లో విడుదలైన ‘లవ్ హాస్టల్’ చిత్రంతో నటుడిగా మరింత గుర్తింపు సంపాదించాడు. 

సినిమా, టెలివిజన్, రంగస్థలం.. ఇలా ఏ మాధ్యమమైనా సరే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకోవడం యుధ్వీర్ ప్రత్యేకత. ముఖ్యంగా లవ్ హాస్టల్ చిత్రంలో ఆయన పోషించిన ‘రాకేష్ దిలావర్’ పాత్ర ద్వారా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన తీవ్రత, సహజత్వం అప్పట్లోనే అందరినీ ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా, ప్రముఖ సినీ డేటాబేస్ సంస్థ ఐఎమ్‌డిబి (IMDb) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ (Popular Indian Celebrities) అధికారిక జాబితాలో యుధ్వీర్ అహ్లావత్ పేరు చోటు చేసుకోవడం విశేషం. కేవలం చోటు దక్కించుకోవడమే కాకుండా, ప్రజాదరణ పరంగా షారుఖ్ ఖాన్, దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, ఐశ్వర్య రాయ్ వంటి అగ్ర తారలను వెనక్కి నెట్టి ఆయన ఈ పాపులర్ జాబితాలో అగ్రస్థానాల్లో నిలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ సందర్భంగా యుధ్వీర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ అవుతూ స్పందించారు. ‘’ఈ అద్భుతమైన క్షణాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఒకప్పుడు సినిమాల గురించి కేవలం కలలు కనే సాధారణ స్థితి నుంచి, ఈరోజు IMDb ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో అగ్ర తారల సరసన చోటు దక్కడం నిజంగా ఒక కలలా, అద్భుతంగా అనిపిస్తోంది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న సినిమా వస్తే ప్రేక్షకులు నటనను ఎంతగా ఆదరిస్తారో యుధ్వీర్ సాధించిన ఈ విజయమే దానికి నిదర్శనం.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.